భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని గిర్ అడవుల్లో లయన్ సఫారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు ఉన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఆయన సఫారీ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… “ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా గిర్ అడవుల్లో ఈ ఉదయం సఫారీకి వెళ్లాను. ఆసియా సింహాలకు గిర్ అటవీ ప్రాంతం నిలయమనే విషయం తెలిసిందే. గిర్ పర్యటన నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన ఎన్నో పనులకు సంబంధించిన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసింది. గత అనేక సంవత్సరాలుగా చేపట్టిన సమష్టి ప్రయత్నాల కారణంగా ఆసియా సింహాల జనాభా క్రమంగా పెరుగుతోంది. ఆసియా సింహాల ఆవాసాలను సంరక్షించడంలో గిరిజన సమూహాలు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళల పాత్ర కూడా ప్రశంసనీయం.
అపురూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలి. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వన్యప్రాణుల సంరక్షణలో భారత్ చేస్తున్న కృషికి గర్విస్తున్నా” అని ట్వీట్ చేశారు. అందరూ గిర్ అడవులను సందర్శించాలని సూచించారు.