ఆంధ్రప్రదేశ్ : సింహాచలంలో ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురి మృతి పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50,000ల చొప్పున పరిహారం ప్రకటించారు.
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ఓ గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.