ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత దిల్లీలో జరుగుతున్న వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం 11గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై మోదీకి రాజ్‌నాథ్ వివరించనున్నారు. ఈ క్రమంలోనే భద్రతా పరిస్థితులతో పాటు సైన్యం తీసుకున్న నిర్ణయాలను మోదీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ నివాసంలో దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. కాగా, ఈ భేటీలో ఆయనతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందని, ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరుగుతోందన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది,
అంతకుముందు ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత సమస్యాత్మక ప్రాంతాలతో పాటు సరిహద్దు వెంట తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా ఆ సమావేశంలో సైన్యం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపైనా చర్చించినట్లు సమాచారం. ఇంకా బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దిల్జీత్ సింగ్ చౌధరీ నార్త్ బ్లాక్‌కు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు పహల్గాం ఉగ్ర దాడితో సరిహద్దుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. భారత్ వైపు నుంచి దాడి ఉండొచ్చన్న అంచనాలతో పాక్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు రాగా, తాజాగా తుర్కియేకు చెందిన పలు సీ-130 హెర్క్యులస్ విమానాలు పాక్‌లో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు సమాచారం అందుతోంది.