స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా చారిత్రక ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జెండా ఎగురవేసిన మూడో ప్రధానిగా రికార్డులకెక్కారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947 నుంచి 1964 మధ్య 17 సార్లు ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు ఆ ఘనత సాధించారు. మోదీ 11 సార్లు ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించి అత్యధికసార్లు మువ్వన్నెల జెండాను ఎగురవేసిన మూడో ప్రధానిగా రికార్డులకెక్కారు.
నెహ్రూ వరుసగా 17 సార్లు జెండాను ఆవిష్కరించగా, ఇందిర మాత్రం 1966-1977, 1980-1984 మధ్య రెండు దఫాలుగా 16 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మోదీ మాత్రం వరుసగా 11సార్లు జెండాను ఆవిష్కరించారు. మోదీ కంటే ముందు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్‌సింగ్ 2004-2014 మధ్య పదిసార్లు వరుసగా జెండాను ఆవిష్కరించారు.
గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్ ప్రధానమంత్రులుగా పనిచేసినప్పటికీ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం వారికి ఒక్కసారి కూడా రాలేదు. చంద్రశేఖర్ నవంబర్ 1990 నుంచి జూన్ 1991 వరకు ప్రధానిగా పనిచేశారు. గుల్జారీలాల్ నందా 1964లో మే 27 నుంచి జూన్ 9 వరకు ఒకసారి, ఆ తర్వాత 1966లో జనవరి 11 నుంచి అదే నెల 24 వరకు రెండోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు. లాల్‌బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ రెండేసి సార్లు జెండాను ఆవిష్కరించారు.