- అనంతవరం ఆలయంలో కానిస్టేబుల్ పవన్ కుమార్ కు పాము కాటు
- పామును ఇవతలికి లాగిన కానిస్టేబుల్
- చేతిపై కూడా కాటు వేసిన కట్ల పాము
- ఆసుపత్రికి తరలించిన ఇతర కానిస్టేబుళ్లు
- చికిత్స పొందుతూ మృతి
అమరావతిలో ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చిన ప్రకాశం జిల్లా దర్శి కానిస్టేబుల్ పవన్ కుమార్ పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే. అయితే, పవన్ కుమార్ చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు.
విధి నిర్వహణ అనంతరం పవన్ కుమార్ తుళ్లూరు మండలం అనంతవరం ఆలయంలో నిద్రిస్తుండగా కట్ల పాము కాటు వేసింది. దాంతో పవన్ కుమార్ ఆ పామును పట్టుకుని ఇవతలికి లాగారు. ఆ క్రమంలో పాము చేతిపై కూడా కాటు వేసింది.
ఇతర కానిస్టేబుళ్లు ఆ పామును చంపివేసి, పవన్ కుమార్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, అతడిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.
కుటుంబాలకు దూరంగా రాత్రనక పగలనక , ఎండనక వాననకా అత్యవసర సర్వీసులలో ఉండే సిబ్బంది అయిన పోలీసులు అత్యంత సాహసోపేతంగా ప్రజల కోసం మీ భద్రత మా బాధ్యత అంటూ సేవలు అందిస్తున్నారు. ఎండకు ఎండుతున్నారు . కనీస మౌలిక సదుపాయాలు ఏమీ లేకున్నా విధి నిర్వహణలో వీరోచితంగా పని చేస్తున్నారు. తాగటానికి నీళ్ళు , తినటానికి ఆహారం కూడా దొరకని పరిస్థితులలో కూడా తమ కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారు. చాలా ప్రాంతాలలో పోలీసులు చేస్తున్న కృషిని చూసి స్వచ్చందంగా పలువురు వారికి భోజన వసతి కల్పిస్తున్నారు. వారి శ్రమను కొనియాడుతున్నారు.
పవన్ కుమార్ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సహచర కానిస్టేబుళ్లలో విషాదం నెలకొంది.
కొందరు పోలీసు మిత్రులు వారి వేదనను పంచుకుంటూ … మాలాంటి వాళ్ళు డ్యూటీకి కొద్దిగా ఆలస్యమైతే ఆబ్సెంట్ రిపోర్ట్ రాయటమే తెలుసు పై అధికారులకు మేము డ్యూటీ కి వచ్చిన తర్వాత అందరూ వచ్చారా అందరికి డ్యూటీలు చెప్పామా అంతే అధికారుల పని అయిపోతే చాలు ఇంక మాలాంటి కానిస్టేబుల్ హోంగార్డులకు డ్యూటీలు చేసే దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అసలు వాళ్లకు భోజనాలు వచ్చాయా డ్యూటీ అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఏవైనా వసతులు ఉన్నాయా అవేమీ పెద్దగా పై అధికారులకు కనిపించవు అలాంటి నిర్లక్ష్యం వల్లే ఈరోజు నువ్వు మా నుండి దూరంగా వెళ్లిపోయావు మిత్రమా. అసలు ఎన్ని చెప్పుకున్నా ఏం లాభం ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు మారినా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతే మనకి మన తోటి వారికి అన్యాయం జరుగుతున్న కూడా అన్యాయం అని తెలిసి కూడా అడగలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము ముందు ముందు ఇలాంటివి జరిగినా కూడా చూస్తూ ఉండటమే తప్ప ఏం చేయలేని పరిస్థితి మాది. ఏదో సాధించాలని పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చాము కానీ ఏం సాధించలేక పై అధికారులు ఏం పని చెప్పినా గొర్రెల్లాగా తల ఊపుకుంటూ చేయటమే ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఎక్కడున్నా నీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ తోటి స్నేహితులు.