- ఎల్బీనగర్ పోలీసులు నన్ను కొట్టారు
- రాత్రంతా స్టేషన్‌లో ఉంచి తీవ్రంగా కొట్టారు
- కలకలం రేపిన మహిళ ఆరోపణలు
LB Nagar: ఎల్బీనగర్ పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని ఓ మహిళ ఆరోపణలు చేయటం కలకలం రేపంది. స్టేషన్‌లో రాత్రంతా ఉంచి తనన లాఠీలతో కొట్టారని ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపాయి. ఈ మేరకు ఆమె బంధువులు స్టేషన్ ఎదుట బైఠాయించిన ఆందోళన నిర్వహించారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో ఉంచి తనను రాత్రంతా కొట్టారని ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్వతంత్ర దినోత్సవం రోజున రాత్రి సమయంలో తనను పోలీసు జీపులో ఎక్కుంచుకొని వెళ్లి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. బాధితురాలు, ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్ నెంబర్-4లో వరలక్ష్మి ఉంటుంది. ఆమెకు భర్త లేడు. పెళ్లీడుకు వచ్చిన కూతురుతో కలిసి అక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
అయితే.. తన కూతురు పెళ్లి కోసం బంధువులను డబ్బులు అడిగేందుకు సరూర్‌నగర్‌కు ఈనెల 15న వెళ్లింది. అనంతంరం సరూర్ నగర్ నుంచి ఎల్బీనగర్‌కు రాత్రి 11 గంటలకు చేరుకుంది. ఎల్బీనగర్ సర్కిల్‌లో ఉన్న పోలీసులు ఆమెను బలవంతంగా జీపులో ఎక్కుంచుకొని స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచి లాఠీలతో కొట్టారు. ఉదయం ఏడు గంటలకు స్టేషన్‌కు వచ్చిన ఓ ఉన్నతాధికారి ఆమెను ఇంటికి పంపించాడని బంధువులు తెలిపారు. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండగా.. ఇవాళ ఉదయం బంధువులు స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్:
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వరలక్ష్మి ఆరోపణలతో ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుళ్లు శివశంకర్, సములతలను సస్పెండ్ చేస్తూ సీపీ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.