- కొలిక్కి వచ్చిన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కసరత్తు
- 8.5 లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణకు తెర
ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చేపట్టిన కసరత్తు కొలిక్కి వచ్చింది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఈ వారంలోనే ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని మండలి వర్గాలు తెలిపాయి. ఆగస్టు 7న ఎస్సై, 28న కానిస్టేబుళ్ల పోస్టులకు నిర్వహించిన ఈ రాత పరీక్షల ఫలితాలను వాస్తవానికి సెప్టెంబరులోనే వెల్లడించాలని తొలుత మండలి నిర్ణయించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించడంతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వర్గాలు ముందుకెళ్లలేకపోయాయి. ఈక్రమంలో కటాఫ్ మార్కులను బీసీ అభ్యర్థులకు 50కి.. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు 40కి తగ్గిస్తూ ఈనెల 2న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఓసీ అభ్యర్థుల కటాఫ్ మార్కులను యథాతథంగా 60గానే ఉంచాలని నిర్ణయించారు. ఈ ఉత్తర్వులతో తగ్గించిన కటాఫ్ మార్కులకు అనుగుణంగా ఫలితాల వెల్లడిపై మండలి కసరత్తు ముమ్మరం చేసింది. ఈమేరకు 554 ఎస్సై పోస్టులకు పరీక్ష రాసిన 2,47,217 మంది.. 16,321 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులకు పరీక్షకు హాజరైన 6,03,955 మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది.
* ప్రాథమిక పరీక్ష ఫలితాల అంశం కొలిక్కి రావడంతో ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెజర్‌మెంట్ పరీక్షల అంశం తెరపైకి వచ్చింది. నవంబరులో వీటిని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహించే వేదిక, తేదీల వివరాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించనుంది.
* తొలుత పరుగు పందెం పోటీలను నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును నిర్ణీత సమయంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారిలో నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారిని లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణించి మరోసారి హాల్‌టికెట్లను జారీ చేస్తారు.