నాజూకు భామ పూజ హెగ్డేకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోను ఈ బ్యూటీకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా నుంచి ఆమె తన దూకుడు ఎంతమాత్రం తగ్గకుండా చూసుకుంటూ వస్తోంది. అలాంటి పూజ హెగ్డేకి అనుకోకుండా ఒక్కసారిగా వరుస ఫ్లాపులు చుట్టుముట్టాయి. దాంతో ఆమెతో పాటు అభిమానులు కూడా నిరాశతో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పూజ చేతుల్లో త్రివిక్రమ్ – మహేశ్ మూవీ మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా కంటే ముందుగా ఆమె పవన్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయవలసి ఉంది. కానీ అది అంతకంతకూ ఆలస్యమైపోతూ ఉంది.
క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘వీరమల్లు’ .. సముద్రఖని దర్శకత్వంలో చేయవలసి ఉన్న ‘వినోదయా సితం’ రీమేక్ పూర్తయితేగానీ, ‘భవదీయుడు భగత్ సింగ్’ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో పవన్ ప్రాజెక్టు కూడా సాధ్యమైనంత త్వరగా మొదలుకావాలనే ఆశతో ఉంది .. ఆరాటపడుతోంది. పాన్ ఇండియా స్థాయి ఫ్లాపులు పెట్టే టెన్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది మరి.