భారత్‌లో ఉన్న పేదరికంపై నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. 2022-23 మధ్య కాలంలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వే (HCES)ను ఉటంకిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే గ్రామాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయం పెరిగినట్లు నీత్ ఆయోగ్ చేపట్టిన సర్వే పేర్కొంది. 2011-12 నుంచి పోలిస్తే.. పట్టణాల్లో నెలవారీ సగటు ఖర్చు రూ.3,501 పెరిగిందని తెలిపింది. అలాగే గ్రామాల వారిగా నెలవారీ ఖర్చులు చూసుకుంటే.. రూ.2,008 ఉన్నట్లు స్పష్టం చేసింది.
అసమానతలు తగ్గాయి
అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆహారం కోసం తమ సంపాదనలో 50 శాతం కంటే తక్కువ ఖర్చు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. 2004-05 కాలంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు చేసే ఖర్చుల్లో 91 శాతం తేడా ఉండేదని.. ప్రస్తుతం అది 71 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. ఇది అసమానతల తగ్గింపును సూచిస్తుందని చెప్పింది. ప్రజల్లో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలు, పండ్లు, పాల వాడకం పెరిగిపోయిందని.. ఇది సమతుల్య ఆహార వినియోగానికి సూచన అని సుబ్రహ్మణ్యం తెలిపారు.
పేదరికం అదృశ్యమైంది
అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రయోజనాలను సర్వేలో చేర్చలేదని సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ నివేదిక వెల్లడించిన వివరాలను చూసుకుంటే భారత్‌లో పేదరికం దాదాపు అదృశ్యమైందని ఆయన స్పష్టం చేశారు.