- సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్.విజయ్ కుమార్
- బడ్జెట్‌లో ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యం దక్కడం శుభసూచికం!
- జిల్లా అభివృద్ధికి కేంద్ర తోడ్పాడు ఎంతో ఉపకరిస్తుంది.
ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు: ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధికోసం రూ.15 వేల కోట్ల నిధులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను కేటాయించడం హర్షనీయమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్. విజయ్ కుమార్ మంగళవారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ నుండి విడిపోయిన తరువాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం కోసం ఒకేసారి భారీ బడ్జెట్ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రజలు రుణపడి ఉంటారని విజయ్ కుమార్ అన్నారు. కేంద్రం సముచిత ఆలోచనతో అన్ని రంగాలకు బడ్జెట్ను అందించిందని అన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగానికి, యువతకు, చిరు వ్యాపారులకు, వివిధ రంగాలలో పనిచేయు ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని తెలిపారు. విభజన హామీలు రాజధాని అవసరాన్ని గుర్తించి ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశంను చేర్చుతానని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తెచ్చారు. బడ్జెట్‌లో ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యం దక్కడం శుభసూచికం అన్నారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధికి కేంద్ర తోడ్పాడు ఎంతో ఉపకరిస్తుందని, దేశ ప్రధాని మంత్రికి, కేంద్రానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ప్రజల తరుపున ఎమ్యెల్యే బిఎన్.విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేసారు.