ముగ్గురు యువకులు… ఉద్యోగాలు లేక ఓ అపరిచితుడ్ని నమ్మారు… అతడి చేతిలో లక్షల డబ్బు పెట్టారు! సీన్ కట్ చేస్తే… మీరు టీసీలు అయిపోయారు… ప్రస్తుతం మీకు ట్రైనింగ్… ఇదిగో కోటు… ఇవిగో ఐడీ కార్డులు… ఇవిగో జరిమానా రసీదు పుస్తకాలు… అంటూ ఆ యువకులను సదరు అపరిచితుడు మరింతగా నమ్మించాడు.
అంతేకాదు, నిత్యం ఒంగోలు-విజయవాడ మధ్య రైళ్లలో తిరుగుతూ కనీసం మూడు కేసులు రాయాలని సూచించాడు. ఈ వ్యవహారం కాస్తా ఓ రైల్వే టీసీ గమనించి గట్టిగా ప్రశ్నించడంతో నకిలీ టీసీల భాగోతం బట్టబయలైంది.
పూర్తి వివరాల్లోకెళితే… వరంగల్ జిల్లాకు చెందిన గణేశ్, కల్యాణ్… మహబూబాబాద్ కు చెందిన ప్రవీణ్ డిగ్రీ చదివారు. అయితే వారికి ఉద్యోగం లేదు. వారికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిప్రసాద్ పరిచయం అయ్యాడు. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగాల ఆశ చూపించాడు. రైల్వేలో టీసీ ఉద్యోగాలు అని చెప్పి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.
కొన్ని రోజులు పోయాక మీకు టీసీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పి, రైళ్లలో తిరుగుతూ కేసులు రాయాలని పురమాయించాడు. అతడు చెప్పింది నిజమేనని నమ్మిన ఆ ముగ్గురు యువకులు అతడిచ్చిన కోట్లు తొడుక్కుని, రైళ్లలో తిరుగుతూ కేసులు రాస్తూ, ఆ జరిమానా డబ్బును తెచ్చి సాయిప్రసాద్ కు అందించేవాళ్లు.
అయితే, ఒకరోజు చీరాల రైల్వే స్టేషన్ లో కేసులు రాస్తున్న యువకుడు గణేశ్ ను రైల్వే టీటీఈ రాజేశ్ అనుమానంతో ప్రశ్నించడంతో, ఆ యువకుడు సంబంధంలేని సమాధానాలు చెప్పాడు. దాంతో రాజేశ్ ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, వారు గణేశ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మరో ఇద్దరు యువకులు కల్యాణ్, ప్రవీణ్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి టీసీ ఉద్యోగాలు అని చెప్పిన సాయి ప్రసాద్ కోసం గాలిస్తున్నారు.
అయితే, ఆ యువకులు టీసీ ఉద్యోగాలు ఎలా వస్తాయో తెలియనంత అమాయకులా…? అనే సందేహాలు తలెత్తాయి. ట్రైనింగ్ లో భాగంగా డబ్బులు వసూలు చేసి తెనాలి వ్యక్తికి అందించడం తదితర అంశాలు నమ్మే విధంగా లేవని భావిస్తున్నారు. వీళ్లందరూ ఒకే ముఠాకు చెందినవారై ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.