కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ పేలిందేమోనని అందరు అనుకున్నారు. కానీ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ కేఫ్‌లో బ్యాగ్ పెట్టాడని.. అందులో నుంచే పేలుడు సంభవించినట్లు కర్ణాటక సర్కార్ నిర్ధారించింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిపోవడం.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. ఆ బ్యాగులో ఐఈడీ (IED) ఉండటం వల్లే పేలుళ్లు జరిగినట్లు చెప్పారు.
9 మందికి తీవ్ర గాయాలు
అయితే ఈ పేలుడు ప్రభావానికి 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు జరిగిన వెంటనే భయంతో.. హోటల్ సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు ఆ పేలుడుకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Another cctv video of the #RameshwaramCafeBlast from police sources 👇 Kar CM Siddharamaiah says complete probe on this issue will be conducted. It is confirmed it's IED blast. Accused seen near the cash counter and then left a bag which led to the blast.#RameshwaramCafe pic.twitter.com/5RZqRBWpkl
— Induja Ragunathan (@R_Induja) March 1, 2024
ఘటనపై వివరాలివ్వాలి
ఇదిలాఉండగా.. కేఫ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ యాదవ్.. రామేశ్వరం కేఫ్ ఫౌండర్ అయిన నాగరాజుకు ఫోన్ చేశారు. తమ కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ పేలలేదని.. ఓ కస్టమర్ వదిలిపెట్టిన బ్యాగులో నుంచి పేలుడు సంభవించినట్లు నాగరాజు వివరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు ఇవ్వాలని ఎంపీ తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు.
రంగంలోకి దర్యాప్తు బృందాలు
బాంబు ప్రమాద ఘటన గురించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి పరమేశ్వరకు సమాచారం ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు పూర్తిగా నిర్ధారణకు వచ్చాక అన్ని అంశాలపై ఓ స్పష్టత వస్తుందని, ఘటనాస్థలంలో ఓ బ్యాటరీని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానం ఇచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డవారు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇక కేఫ్‌లో పేలుడు విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. అగ్నిమాపక సిబ్బంది, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో పాటు బాంబుస్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఫోరెన్సిక్ నిపుణులూ రంగంలోకి దిగారు.