మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలిక అర్ధనగ్న స్థితిలో, రక్తస్రావం అవుతున్న పరిస్థితుల మధ్య సాయం చేయాలంటూ కనిపించిన ప్రతి గుమ్మాన్ని, వ్యక్తిని కోరింది. కానీ, పోపో అంటూ చేతులు దులిపేసిన వారే కానీ సాయం చేసే వారు కనిపించలేదు. ప్రదర్శన చూసినట్టు చూశారు. ఓ వ్యక్తి అయితే సాయం కోరుతున్న బాలికను తరిమి కొట్టడం కనిపించింది. ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చివరికి ఓ ఆశ్రమం ఆమెను ఆదుకుంది. ఆమెను చూసి టవల్ ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బాద్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఆమెను తొలుత జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు సీరియస్ గాయాలు అయినట్టు, అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. రక్తం కావాల్సి ఉండడంతో ఇండోర్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు బాలికతో మాట్లాడే ప్రయత్నం చేయగా, ఆమె షాక్ లో ఉంది. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు. బాలిక ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన వ్యక్తి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.