contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆ విషయంలో కేంద్రం వెంటే ఉంటాం … రాజ్‌నాథ్‌కు .. రేవంత్ రెడ్డి హామీ

భారత దేశ రక్షణ విషయంలో మేం రాజకీయాలు చేయం… చేయనివ్వమని… తమ ప్రభుత్వం కేంద్రం వెంటే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… ఈ రాడార్ కేంద్రం ద్వారా దేశ రక్షణ రంగం విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసిందన్నారు.

దేశ రక్షణ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉందని వెల్లడించారు. వీఎల్ఎఫ్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మక ప్రాంతమన్నారు. కానీ కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. దేశ భద్రత, రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. అలాగే దేశ భద్రత విషయంలో రాజకీయాలు ఏమాత్రం సరికాదన్నారు.

ఈ ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదనే ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు తామూ ముందుకు వచ్చామన్నారు. దేశ భద్రతకు హైదరాబాద్ చాలా కీలకమైన ప్రాంతమన్నారు. ఈ విషయంలో తాము ఎప్పుడూ కేంద్రం వెంటే ఉంటామని స్పష్టం చేశారు.

మన పార్టీలు వేరు… సిద్ధాంతాలు వేరు కావొచ్చు… కానీ దేశ భద్రత, రక్షణ విషయంలో మాత్రం ఎప్పుడూ మీతో కలిసే ఉంటామని రాజ్‌నాథ్ సింగ్‌ను ఉద్దేశించి చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుల్లో తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నేవీ కాలేజీలో 25 శాతం సీట్లు స్థానికులకు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

రాడార్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీవోలు ఇచ్చారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడటం సరికాదన్నారు.

నేవీ రాడర్ కేంద్రానికి సహకరించాల్సింది పోయి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే బీఆర్ఎస్ దేశ సమగ్రత, భద్రతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంటుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రాడార్ కేంద్రంతో తెలంగాణకు మరింత పేరు వస్తుందన్నారు. కాగా, రాడార్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :