హైదరాబాద్ : మూసీ నదిని బాగు చేసేవాడు ఒకడొచ్చాడని ప్రజలకు తెలిసింది… నేను ఫుట్‌బాల్ ప్లేయర్‌ను… గేమ్ ప్లాన్‌పై నాకు పూర్తి స్పష్టత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం అంశంపై స్పందించారు. 55 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవమైతే భాగ్యనగరం అద్భుత నగరం అవుతుందన్నారు.
ప్రజలను ఇబ్బందిపెట్టి తాము భూములు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. మూసీ కోసం భూములు ఇచ్చే వారికి వంద శాతం న్యాయం చేస్తామన్నారు. మూసీని ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉంటుందని, కానీ బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదన్నారు.
అంతర్జాతీయస్థాయి అవగాహన ఉన్న కేటీఆర్‌కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ నుంచి కూడా సలహాలను ఆహ్వానిస్తున్నామన్నారు. మూసీకి సంబంధించి కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కూడా తమ ప్రతిపాదనలు పంపించాలన్నారు.
సీఎం కావాలనే నా కల నెరవేరింది
ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేరిందని, అంతకుమించిన పెద్ద కలలు మాత్రం తనకు లేవన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్ల అంశాలపై విచారణ జరుగుతుందన్నారు. ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా విచారణ ఉంటుందన్నారు.
ప్రజలకు మంచి చేయాలని మాత్రమే అనుకుంటున్నామని, కాబట్టి రాజకీయంగా నష్టం జరిగినా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేశామన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు, సంక్షేమ పథకాల అమలు… ఇలా అన్నీ చేస్తున్నామన్నారు.