పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ‘ఏం పీకనీకి పోయినవ్’ అనడం ఏం సంప్రదాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓటాన్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా బుధవారం సభలో ఆయన మాట్లాడారు. నల్గొండ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాళేశ్వరం అవినీతి బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతరా అంటూ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ చచ్చిన పాము అని, చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు కేసీఆర్ అనే పామును చంపేశారని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడినా కూడా బీఆర్ఎస్ నేతలకు బుద్ధిరాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా? అని సభలో ప్రశ్నించారు. మేడిగడ్డలో నీళ్లు నింపి రైతులకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారని గుర్తుచేస్తూ.. మొన్నటి వరకు ఆ శాఖ బాధ్యతలు చూసిన మాజీ మంత్రులకే ఆ బాధ్యత అప్పగిస్తామని, ఎలా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ, ఇతర బ్యారేజీలపై, ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోయి ఫాంహౌస్ లో పడుకున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా సభకు హాజరు కావాల్సిన కేసీఆర్.. కాలు నొప్పి అని చెప్పి సభకు రాకుండా నల్గొండలో రాజకీయ సభకు హాజరయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెడతామని వివరించారు.