త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును సీఎం ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను సీఎం అభినందించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సెమెంజాకు అవార్డును అందించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మూడు వందల ఎకరాల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీంతో మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయ వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణ దూరంలోని అత్యంత సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుంది.’ అన్నారు.
ఒక్క బయో సైన్సెస్ లోనే కాదు, ఐటీ-సాఫ్ట్ వేర్, రీసెర్చ్, స్టార్టప్ రంగాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన అనుకూల వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. చిన్న స్టార్టప్ లు, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వారధిగా నిలిచే ఎంఎస్ఎంఈ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.