మునుగోడు: రాష్ట్రంలోని ప్రజా సమస్యలు పరిష్కరించకుండా జాతీయ రాజకీయాల పేరుతో సీఎం కేసీఆర్ దేశం తిరుగుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన తీరు ‘కూట్లో రాయి తీయలేని వారు.. ఏట్లో రాయి తీశారన్నట్టుగా’ ఉందని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల, బంగారిగడ్డ, చామలపల్లి, కస్తాల గ్రామాలలో మంగళవారం రాత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గంలో చర్లగూడెం భూనిర్వాసితులకు తెరాస ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు. చండూరులోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సామగ్రిని కాల్చివేయడంపై స్పందిస్తూ.. దొంగచాటుగా తాగుబోతులతో జెండాలు తగలబెట్టించారని మండిపడ్డారు. తాము తలుచుకుంటే ఇతర పార్టీల కార్యాలయాలు ఉండవని హెచ్చరించారు. పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాశ్ మాట్లాడారు.
14 న నామినేషన్
ఈ నెల 14న మధ్యాహ్నం ఒంటి గంటకు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి చండూరులో నామినేషన్ దాఖలు చేస్తారని రేవంత్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులు తరలిరావాలని కోరారు.
ఇద్దరు నేతల ఆత్మీయ పలకరింపు
చండూరు మండలం కొండాపురంలో దుబ్బాక వెంకన్న అనే వ్యక్తి ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడ్డారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం రాత్రి ఆయనను పరామర్శించేందుకు వచ్చారు. అటుగా కారులో వెళ్తున్న రేవంత్‌రెడ్డి అక్కడ ఆగి ప్రవీణ్‌కుమార్‌ను ఆత్మీయంగా పలకరించారు.
కాంగ్రెస్‌కు లభిస్తున్న ఆదరణ ఓర్వలేకే ఈ దుశ్చర్యలు
గాంధీభవన్: చండూరులో కాంగ్రెస్ కార్యాలయంపై దుండగులు దాడిచేసి, ప్రచార సామగ్రిని తగులబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని, జిల్లా వ్యాప్తంగా తెరాస, భాజపాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, నేతలు జగ్గారెడ్డి, సీతక్క, వీహెచ్, షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు.