- వాహనం ఢీకొని తన కాళ్లు నుజ్జునుజ్జయినా అక్కున చేర్చుకుని..
- ఆస్పత్రికి తరలిస్తుండగా ఏఆర్ కానిస్టేబుల్ మృతి
- భార్యకూ తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
- అనంతలో ఘటన.. స్పందించని జనం
అనంతపురం: ఈ ఫొటోలో కనిపిస్తోంది భార్యభర్తలు! ఓ లారీ పైనుంచి వెళ్లడంతో భర్త రెండు కాళ్లూ దాదాపు నడుం దాకా నుజ్జునుజ్జయ్యాయి! తానిక బతకను అని ఆయనకు తెలిసినా.. గాయాల తాలూకు బాధను పంటిబిగువ భరిస్తూనే పాకుతూ కాస్త దూరంలో పడ్డ భార్య వైపు కదిలాడు! ముక్కు, చెవుల్లోంచి రక్తం కారుతుండగా, తీవ్ర షాక్లో ఉన్న భార్యను అక్కున చేర్చుకున్నాడు.
ఏమే “నీకు, నాకు ఏమీ అవ్వదు. ధైర్యంగా ఉండు”
అని ఆమెను సముదాయించాడు. గుండెలను పిండేసే ఈ దృశ్యాన్ని అక్కడి వారంతా ఫొటోలు, వీడియోలు తీస్తూ చూస్తూ ఉండిపోయారే తప్ప ఏ ఒక్కరూ సాయానికి ముందుకు రాలేదు. అంబులెన్స్తూ ఫోన్ చేయలేదు. అనంతపురం జిల్లా కేంద్రం శివార్లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుడు ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్(42), తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది ఆయన భార్య అనిత! ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. శింగమల మండలం తరిమెల జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్నారు. కిరణ్ కుమార్, అనిత దంపతులకు ఐదో తరగతి ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.
అనంతపురం ఎస్బీఐ కాలనీలో ఈ కుటుంబం ఉంటోంది. అనిత.. రోజూ మరో ఇద్దరు టీచర్లతో కలిసి పాఠశాలకు కారులో వెళతారు. బుధవారం ఓ టీచర్ రాకపోవడంతో కారు రాలేదు. దీంతో బస్సులో వెళ్లాలని అనిత అనుకున్నారు. ఉదయం 7:30కు అనితను భర్త కిరణ్ కుమార్ బైకైపై ఎక్కించుకొని సోములదొడ్డి బస్టాపలో డ్రాప్ చేసేందుకు బయలుదేరారు. 44వ నంబరు జాతీయ రహదారిపై తపోవనం-ఇస్కాన్ మధ్యలో సీ-2 కాఫీ షాప్ ఎదుట బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ కింద పడ్డారు. ఆ వెంటనే.. వెనుక నుంచి ఓ లారీ వేగంగా కిరణ్ కాళ్ల మీదుగా దూసుకుపోయింది. ఈ ఘటనలో కిరణ్ రెండు కాళ్లూ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. చాలా సేపటి తర్వాత ఆవైపుగా అంబులెన్సు రావడంతో ఇద్దరినీ అందులో ఎక్కించి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడికి చేరేలోపే కిరణ్ మృతిచెందారు. అనిత పరిస్థితి విషమంగా ఉంది.