అల్లూరి జిల్లా, అనంతగిరి : ఓ వైపు దేశం చంద్రుడిలో అడుగు పెట్టింది… మరోవైపు సూర్యుడిని అధ్యయనం చేయడానికి రెడీ అవుతోంది.. అయినప్పటికీ నేటికీ కనీస సౌకర్యాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. విద్య, పౌష్టికాహారం, వైద్యం లభించని అనేకమంది ప్రజలు ఉన్నారు. గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం సక్రమంగా లేక అడవిబిడ్డలు అవస్థలు పడుతున్నారు. వానకాలంలో మోస్తరు వార్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లడం, రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి. వానకాలం వ్యాధుల నివారణలో భాగంగా వైద్యబృందాలు కూడా మోకాలు లోతు బురద, వాగులు దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. గర్భిణులు ప్రసవాలకు దవాఖానలకు పోవాలంటే అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు రావడానికి అవకాశం లేదు. స్థానికులు మంచాలపై గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తున్నది.
అనంతగిరి మండలం, పినకోట పంచాయతీ, పందిరిమామిడి గ్రామానికి రహదారి సౌరకర్యం కల్పించాలని,మండల కేంద్రము నుంచి పందిరిమామిడి గ్రామానికి సుమారు 60 కిలోమీటర్ల దూరం పై బడి ఉంటుందని , పంచాయతీ కేంద్రం నుంచి 8 కిలోమీటర్ల దూరం రహదారి నిర్మాణం చేసి ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి, జై భారత్ ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నీడ్స్ సంస్థ కన్వీనర్ అర్.లక్ష్మణ్ తెలిపారు.