- తెగిన కల్వర్టులు.. ప్రయాణికుల పాట్లు.. పెరుగుతున్న ప్రమాదాలు
- మరమ్మతులపై అధికారుల ప్రతిపాదనలు. సర్కారు మౌనం
- తాత్కాలిక మరమ్మతులకూ నిధులు మంజూరు చేయని వైనం
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం నుండి గుంజేడు వైపు నుండి మహబూబాబాద్ కు వెళ్లే రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో కొన్ని గ్రామాల ప్రజలకు ఊరు దాటి రావాలంటే సాహసమే అవుతోంది. కారో.. బైకో ఎక్కి రోడ్డు మీదకొస్తే సౌకర్యవంతంగా ప్రయాణించే పరిస్థితులు లేవు. తారు అంతా కొట్టుకుపోయి.. పైకి తేలి చెల్లాచెదురైన కంకర.. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుంతలు.. వాటిలో నీళ్లు నిండి.. బురదమయమై.. మనం ప్రయాణం చేస్తోంది రోడ్డు మీదేనా? అన్న అనుమానం వచ్చేలా చాలాచోట్ల రహదారులు ఘోరంగా మారాయి. పలుచోట్ల ద్విచక్రవాహనంపైనే కాదు.. కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఓ రెండు, మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే వాహనానికే కాదు అందులో ప్రయాణిస్తున్నవారి ఆరోగ్యానికీ దెబ్బే అన్నంత ప్రమాదకరంగా రోడ్లు మారిపోయాయి. ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడం, ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. మండల, గ్రామ రహదారులైతే మరీ అధ్వానంగా తయారయ్యాయి. రాత్రివేళల్లో సరిగా కనిపించక గుంతల్లోపడి వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.