యువతకు మెరుగైన అవకాశాలు అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర (PM Narendra Modi) మోదీ రోజ్‌గార్ మేళా (Rozgar Mela) పథకాన్ని తీసుకొచ్చారు. గతేడాది అక్టోబర్‌లో ధన్‌తేరస్ సందర్భంగా మోదీ ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు. 10 లక్షలప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడమే దీని లక్ష్యమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోజ్‌గార్ మేళా మొదటి విడతలో 75 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉపాధి కోసం దాదాపు 71,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను శుక్రవారం మోదీ వర్చువల్‌గా అందజేయనున్నారు.
PMO విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన దాదాపు 71,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు పంపిణీ చేయనున్నారని తెలిపింది. అనంతరం ఉదయం 10:30 గంటలకు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపింది. రోజ్‌గార్ మేళా పథకం ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న మోదీ ఆశయాల దిశగా మరో ముందడుగు అని పేర్కొంది.
కొత్తగా రిక్రూట్ అయిన సభ్యులు జూనియర్ ఇంజనీర్లు, లోకోమోటివ్ డ్రైవర్లు, టెక్నీషియన్‌లు, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, స్టెనోగ్రాఫర్లు, ఆదాయ పన్ను శాఖలో, వివిధ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్య , ఆరోగ్య సంబంధిత విభాగాలలో సేవలు
అందిస్తారు.
గతేడాది 75 వేల మందికి ఉద్యోగాలు
గత సంవత్సరం మొదటి విడత నియామకాల్లో 75,000 మందికి పైగా ఉద్యోగాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇతర దేశాలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆర్థిక సవాళ్ల నుంచి బయటపడటానికి భారత్ సమర్థంగా కృషి చేస్తోందని ప్రశంసించారు.
కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్
రోజ్‌గార్ మేళా పథకం మరింత మందికి ఉపాధి కల్పించేందుకు సహాయపడుతుందని పీఎంవో తెలిపింది. యువతను దేశాభివృద్ధిలో భాగం చేసేలా వారికి అర్ధవంతమైన అవకాశాలను అందించడమే పథకం లక్ష్యమని పేర్కొంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతకు శిక్షణ అందించేందుకు కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్‌ను మోదీ ప్రారంభించారు.