కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ భూములకు పట్టాలిచ్చి,రైతు బంధు రైతు భీమా పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటే,ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం పట్టా భూములకు లోన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని,రుణమాఫీ కూడా చేయడం లేదని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గంలోని మానిక్ పఠార్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానం పలికారు.ప్రవీణ్ కుమార్ వారితో మాట్లాడి,వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మానిక్ పవార్ 1950 నుండి గుర్తించబడిన గ్రామంగా ఉందని,70 ఏళ్లుగా నివసిస్తున్నా అక్కడి ప్రజలకు కనీసం ఇళ్లు లేవని,రోడ్డు సౌకర్యం లేదని,కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ఆ గ్రామాన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతంగా పరిగణిస్తూ తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోండ్ వీరుడు కొమురం భీమ్ ఉద్యమ కాలం నుండి ఈ గ్రామం ఉందని,ఇపుడు తీసివేస్తే అక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఆదివాసులకు మౌలిక సౌకర్యాలు కల్పించకుండా వారిని తీసివేయాలని చూస్తే ఊరుకోమన్నారు. కొమురం భీం స్పూర్తితో ప్రజల కోసం పోరాడుతామని హెచ్చరించారు.
ట్రైబల్ ఆఫీసర్, కలెక్టర్ ను కలిసి దళిత, గిరిజన బిడ్డలకు న్యాయం జరిగే విధంగా చూస్తానని తెలిపారు . ఈ గ్రామ పిల్లలంతా, కెసిఆర్ పెట్టిన గురుకులాల్లో చదివి ఉద్యోగులుగా, డాక్టర్లుగా తయారుకావాలని కోరారు. ఆదివాసుల హక్కులు కాలరాయాలని చూస్తే, ఫారెస్ట్ అధికారుల అరాచకారులను మేం నిలదీస్తామన్నారు. ఇంతవరకు నియోజకవర్గంలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రజల పరిస్థితులు చూడకపోవడం అన్యాయమన్నారు. రాబోయే కాలంలో ఈ గ్రామానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు