తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్వామి వారిని దర్శించుకున్నారు. పూజ సమయంలో రేవంత్, ఆయన భార్య, కోమటిరెడ్డి, ఉత్తమ్ లు కొంత ఎత్తున్న స్టూళ్లపై కూర్చున్నారు. వీరి పక్కన మల్లు భట్టి తక్కువ ఎత్తున్న పీఠంపై కూర్చున్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగిందని అన్నారు. ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటమని చెప్పారు.
ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు గుప్పించింది. యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, బహుజన బిడ్డ కొండా సురేఖను రేవంత్ రెడ్డి అండ్ కో ఘోరంగా అవమానించిందని ట్వీట్ చేసింది. వారు పైన కూర్చిని భట్టి విక్రమార్క, కొండా సురేఖను రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానించారని వ్యాఖ్యానించింది.