నాటో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్, స్వీడన్ దేశాలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా పెద్ద తప్పు చేస్తున్నారని హెచ్చరించింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాల నిర్ణయంతో మిలిటరీపరమైన ఉద్రిక్తతలు పెరుగుతాయని చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము చూస్తూ ఊరుకుంటామనే భ్రమల్లో నుంచి వారు బయటకు రావాలని అన్నారు. రష్యాతో ఫిన్లాండ్ దాదాపు 1,300 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దేశం నాటోలో చేరితే తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని రష్యా భావిస్తోంది. ఇదే కారణం వల్లే ఉక్రెయిన్ పై రష్యా దండెత్తింది.