- వరదల్లో చిక్కుకున్నవారిని ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు
- సదా మీ సేవలో జిల్లా పోలీస్ యంత్రాంగం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, ప్రజా రక్షణే ప్రథమ లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజలను వరదల బారి నుండి తప్పించడానికి రక్షణ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా నీటిలో చిక్కుకున్న సుమారు 80 కుటుంబాలను, సిరిసిల్ల పట్టణంలో సుమారు 60 మందిని,వివిధ మండలాల్లో సుమారు 140 మందిని,గర్భిణి మహిళలను, వృద్దులను వివిధ శాఖల సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ యంత్రాంగం గురువారం ఉదయం నుండి ప్రజా రక్షణ ద్యేయంగా ప్రజలకు అందుబాటులో ఉండి,క్షేత్ర స్థాయిలో ప్రమాదకరంగా ఉన్న చెరువులు, వాగులు, రహదారుల వద్ద సిబ్బందితో పాటు బారికేడింగ్ ఏర్పాటు చేశారు.శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయితీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు.భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం 24/7 అందుబాటులో ఉంటుంది అని ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన డయల్100 కి లేదా మీ దగ్గర్లో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేప్పట్టడం జరుగుతుందన్నారు. ప్రజలు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.