నాగార్జునసాగర్ : భారీ వర్షాలు, వరదలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయిర్ లు నిండుకుండలా మారాయి. గంట గంటకూ జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. ఈరోజు (సోమవారం) సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నద్దం అయ్యారు.
సాగర్ వద్ద ఉదయం 8 గంటలకు ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు నల్లగొండ జిల్లా (తెలంగాణ) కు చెందిన సీఈ నాగేశ్వరరావు తెలిపారు. సాగర్ నుండి నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద పెరిగితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు కలెక్టర్ లు సూచించారు.
కాగా, సాగర్ జలాశయానికి 4.27 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 576.10 అడుగులకు చేరింది. నీటి నిల్వ గరిష్ఠ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 271.90 టీఎంసీలుగా ఉంది. ఇదే స్థాయిలో నీటి ప్రవాహం రానున్న వారం రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ అధికారుల అంచనాతో ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.