స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు జాతీయ, అంతర్జాతీయ దర్యాఫ్తు సంస్థలకు ఓ కేస్ స్టడీగా మారుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబును పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఓ దొంగను పట్టుకుంటే ఎల్లో మీడియా హడావుడి ఎక్కువైందన్నారు. కోర్టు కూడా ఏకీభవించాక హడావుడి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో కుట్రలతో కూడిన యజ్ఞంలా ఆర్థిక అక్రమాలు చేశారన్నారు. షెల్ కంపెనీల పేరుతో వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తాము లేమని సీమెన్స్ చెబుతోందని, అగ్రిమెంట్ జరగలేదని చెప్పిందన్నారు. హవాలాపై ఈడీ కూడా విచారిస్తోందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం, జైల్లో ఉంచడమే తప్పన్నట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. తనను హౌస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారని, దేశంలో ఉండే చట్టాలు ఆయనకు వర్తించవా? అని ప్రశ్నించారు. అరెస్టయ్యాక ఎవరికీ కల్పించని సౌకర్యాలను చంద్రబాబుకు కల్పించామన్నారు. హౌస్ కస్టడీలో ఉంటే దానిని అరెస్ట్ అంటారా? ఇంట్లో ఉంచే దానికి అరెస్ట్ చేయడం దేనికి? అని వ్యాఖ్యానించారు. ఆయన అరెస్ట్, జైలులో ఉంచడంలో ఎలాంటి రాజకీయ కక్ష లేదన్నారు. అరెస్టయ్యాక ఎవరికీ కల్పించని సౌకర్యాలు ఆయనకు కల్పించినట్లు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్, యువత పేరు చెప్పి దోచుకున్నారన్నారు. సానుభూతి, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు పాకులాడుతున్నారన్నారు.
ఓ దొంగను అరెస్ట్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందా? చెప్పాలన్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు కావన్నారు. దోచుకోవడానికే ఈ పథకం పెట్టారని, దానిని విజయవంతంగా అమలు చేశారన్నారు. సీమెన్స్‌కు డబ్బులిచ్చామని టీడీపీ నేతలు చెబుతుంటే, తమకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని సీమెన్స్ చెబుతోందన్నారు. ఆ డబ్బు షెల్ కంపెనీలకు వెళ్లినట్లుగా అర్థమైందన్నారు. రూ.371 కోట్ల ప్రజాధనం చంద్రబాబు దోచుకున్నారని బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రాష్ట్రానికి వందల కోట్ల నష్టం జరిగిందన్నారు.