రాజన్న సిరిసిల్ల జిల్లా :భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం అని కమాండెంట్ యస్.శ్రీనివాస రావు అన్నారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి వేడుకలను 17వ పోలీస్ బెటాలియన్,సర్దాపూర్ నందు కమాండెంట్ యస్.శ్రీనివాస రావు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ ఆనాటి నిరంకుశ రజాకార్లకు, దేశ్ ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో భూపోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని, చాకలి ఐలమ్మ ధైర్యంతో తెగువ చూపుతూ దేశ్ ముఖ్, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందని కమాండెంట్ పేర్కొన్నారు. తెలంగాణ వీరవనితగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ జయంతి రోజున వారిని స్మరించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎ.జయప్రకాశ్ నారాయణ,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.శైలజ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.