తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత తన స్పందనను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆమె ఇటీవల విడాకులు తీసుకున్న విషయం గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు స్త్రీల ప్రతిష్ఠకు సంబంధించిన చర్చను తెరపై పెట్టాయి.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందిస్తూ.. తన విడాకులు తన వ్యక్తిగత విషయమని, దాని గురించి ఎవరూ ఊహాగానాలు చేయవద్దని ఆమె అన్నారు. ఒక మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి పోరాడటానికి ఎంతో ధైర్యం, బలం కావాలని చెప్పారు. ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానని… దయచేసి చిన్నచూపు చూడవద్దని కోరారు. ఒక మంత్రిగా మీ మాటలకు ఎంతో విలువ ఉంటుందనే విషయాన్ని మీరు గ్రహించి ఉంటారని అన్నారు.
ఇతర వ్యక్తుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా వ్యవహరించాలని తాను కోరుతున్నానని సమంత చెప్పారు. తన విడాకులు సామరస్యపూర్వకంగా జరిగాయని… అందులో రాజకీయ ప్రమేయం లేదని అన్నారు. తాను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటానని… తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నానని చెప్పారు.