జగన్ పాలనలో ఇసుక లభ్యం కావడమే గగనమైందని, బ్లాక్ మార్కెట్లో బంగారం కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇవాళ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాలకొల్లు పట్టణంలో నడిరోడ్డుపై తోపుడు బండిపై ఇసుక ప్యాకెట్లు పెట్టుకుని విక్రయించారు. బండిని తోసుకుంటూ, ఇకపై మనకు బంగారంలా ఇలా ప్యాకెట్లలోనే ఇసుక లభ్యమవుతుందని అన్నారు.
అంతేకాదు, ఓ మహిళ వచ్చి ఈ బంగారు గాజులు తీసుకుని ఇసుక ఇవ్వండి సర్ అని రామానాయుడ్ని కోరగా… ఆయన ఆ గాజులను తూకం వేసి సరిపడినంత ఇసుక ఇచ్చారు. “ర్యాంపుల్లో ఇసుక ఫుల్ నిర్మాణాలకు నిల్”… “నిండా నోట్లు ఇచ్చినా తట్ట ఇసుక కొనలేం” అంటూ ఈ సందర్భంగా ఆయన తోపుడి బండిపై పలు స్లోగన్లను కూడా ప్రదర్శించారు.
దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. జగన్ ప్రభుత్వంలో ఇసుక దొరక్క బ్లాక్ మార్కెట్లో బంగారం ధరను మించి ఉండడంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించి పోయిందని తెలిపారు. ఈ రంగంపై ఆధారపడిన అన్ని రంగాల కార్మికులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు
#జగన్ ప్రభుత్వంలో ఇసుక దొరకక బ్లాక్ మార్కెట్లో బంగారు ధరను మించి ఉండడంతో భవన నిర్మాణరంగం పూర్తిగా స్తంభించి ఈ రంగంపై ఆధారపడిన అన్ని రంగాల కార్మికులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితుల్లో బంగారం దొరుకుతుందేమో గాని ఇసుక దొరకడం లేదంటూ…. నడిరోడ్డులో తోపుడు బండిపై… pic.twitter.com/6omL67CxDK
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) March 13, 2024