- ఫలించిన ‘”నేనుసైతం”‘ పోరాటం
- ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం
- కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
- మక్తల్, మగానూర్ రీచ్ లపై కలెక్టర్ చర్యలు హర్షనీయం
- కలెక్టర్ శ్రీహర్షకు…. ఋణపడివుంటాం
- మక్తల్, మగానూర్ పోలీసులపై….మాఫియా ఒత్తిడి
- ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం మోపే వరకు….పోరాటం ఆగదు
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి, మక్తల్, మగానూర్ రీచ్ లను సీజ్ చేసేలా నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చర్యలు తీసుకోవడం హర్షణీయమని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ధ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ అన్నారు. నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని గత కొంతకాలంగా జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నేనుసైతం స్వచ్చంద సంస్ధ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ చేసిన పలు ఫిర్యాదులపై స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్వయంగా కలెక్టర్ శ్రీహర్ష రంగంలోకి దిగడన్నీ స్వాగతిస్తున్నామన్నారు.
నారాయణపేట జిల్లాలో ప్రధానంగా మక్తల్, మగానూర్ మండలంలోని వరుకుర్, దాసరదొడ్డి శివారులోని పెద్దవాగు, మన్నెవాగుల నుండి ఇసుకను అక్రమంగా మహబూబ్ నగర్, హైదరాబాద్ లకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక వరుకుర్ పెద్దవాగు నుండి దాదాపు 10 నుండి 15 భారత్ బేంచ్ లతో ఇసుకను అక్రమంగా తరలిస్తూ…..కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాపై గత 10 సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నామని ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా ఈ చర్యల నేపధ్యంలోనైనా ఇసుక మాఫీయా కట్టడవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ప్రభుత్వ పథకాల పేరిట అనుమతులు పొందిన కొంతమంది కాంట్రాక్టర్లు ఒక వే బిల్ పేరిట పదుల సంఖ్యలో లారీల ఇసుకను మహబూబ్ నగర్, హైదరాబాద్, రాయచూరు తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. వీటన్నింటిపై స్వయంగా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని విచారణ జరిపితే తప్ప ఇసుక మాఫియాను నియంత్రించలేమని ఆయన అన్నారు.
మొత్తంమీద నారాయణపేట జిల్లా మగానూర్ లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కలెక్టర్ చర్యలు తీసుకొని, తమ సిబ్బందిచే మగానూర్ మండలంలోని వరుకుర్, దాసరదొడ్డి శివారులోని పెద్దవాగు, మన్నెవాగుల వెంబడి ఉన్న రీచ్ లను సీజ్ చేయడంపై నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఋణపడివుంటామని సామాజిక కార్యకర్త ప్రవీణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ కమిటిలను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపేవరకు తమ పోరాటం ఆగదని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ధ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇదిలావుంటే కలెక్టర్ ఆదేశాలతో ఒకవైపు రెవిన్యూ అధికార యంత్రాంగం ఇసుక రీచ్ లను సీజ్ చేస్తుండగా, మరోవైపు మక్తల్, మగానూర్ పోలీసులపై ఇసుక మాఫియా దాడులను ఆపాలని ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.