- కలెక్టర్ ఆదేశాలు…. డోంట్ కేర్
- నిన్న రివ్యూ… నేడు అక్రమ రవాణా
- దేవరకద్రలో…. ఇసుక ట్రాక్టర్ బోల్తా
- మైనర్లు ఇసుక ట్రాక్టర్లు నడుపుతున్న … పట్టించుకోని వైనం
- దేవరకద్ర తహసీల్దార్, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలి
- ఇసుక మాఫియాకు అధికారుల అండ దండలు
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లాలోని రెవిన్యూ, సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేసిన 24 గంటలు గడవకముందే, శుక్రవారం ఉదయం దేవరకద్ర మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. ఒకవైపు ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తుంటే, మరోవైపు కలెక్టర్ ఆదేశాలు డోంట్ కేర్ అంటూ, ఇసుక మాఫియా మాత్రం తమ అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉంది. గత కొంతకాలంగా దేవరకద్ర మండలంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఈనెల 19న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని రెవెన్యూ, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
కలెక్టర్ హెచ్చరించిన… మారని మాఫియా తీరు
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన, ఇసుక మాఫియా తీరు మారలేదని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం నేనుసైతం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టాలని కలెక్టర్ ఆదేశించి 24 గంటలు గడవక ముందే దేవరకద్ర మండలం నాగారం గ్రామ శివారులో ఇసుకను అక్రమ రవాణా చేస్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుందని ఆయన తెలిపారు. ఇసుకను పెద్దరాజమూరు వాగు నుండి నాగారం గ్రామం మీదుగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా, నాగరం గ్రామ శివారులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిందని ఆయన పేర్కొన్నారు. మైనర్లు ఇసుక ట్రాక్టర్లు నడుపుతూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, దీంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన వాపోయారు. ఈ ట్రాక్టర్ బోల్తా పడటంతో పెద్ద రాజమూర్ నుండి నాగారం వైపు వెళ్లే స్కూల్ విద్యార్థులకు తీవ్ర అంతరాయం జరిగిందని, రోడ్డు మొత్తం ఇసుక చెల్లాచెదురుగా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ విషయం బయటికి పోకుండా ఇసుక మాఫియా వెంటనే జెసిబి ని తీసుకువచ్చి ట్రాక్టర్ను తీసుకొని పక్కకు నెట్టి వేయడం జరిగిందన్నారు.
దేవరకద్ర తహసీల్దార్, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలి
పట్ట పగులు ఇసుక అక్రమ రవాణా చేస్తూ ట్రాక్టర్ బోల్తాపడ్డ, ఇప్పటికీ దేవరకద్ర పోలీసులు, రెవిన్యూ అధికారులు ఇసుక మాఫియాపై కేసులు నమోదు చేయకపోగా, ట్రాక్టర్లును సీజ్ చేయకపోవడం, ట్రాక్టర్ నడిపిన మైనర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తే, దేవరకద్ర అధికారులు ఇసుక మాఫియాతో కుమ్ముకయ్యారని స్పష్టమవుతుందని ఆయన ఆరోపించారు. దేవరకద్ర ఇసుక మాఫియాకు దేవరకద్ర రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకరిస్తున్నారని, దేవరకద్ర తహసీల్దార్, ఎస్ఐలపై కలెక్టర్ విజయేంద్ర బోయి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.