విధుల నిర్వహణలో అలసత్వం వద్దు
వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు వేగవంతం
నియంత్రికల వైఫల్యాలను తగ్గించండి
బకాయిల వసూళ్ళకు ప్రాధాన్యతనివ్వండి
సమీక్షా సమావేశంలో సిఎండి కె. సంతోష రావు ఆదేశం
తిరుపతి : విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలందించాలని ఎపిఎస్ పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు అధికారులను ఆదేశించారు. ఎపిఎస్ పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం తిరుపతి సర్కిల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎండి సంతోష రావు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో వుంచుకుని వినియోగదారులకు నిరంతర విద్యుత్తును సరఫరా చేయాలని సూచించారు. వినియోగదారులకు సత్వర సేవలందించడంపై క్షేత్ర స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. విధుల నిర్వహణలో అలసత్వం చూపే అధికారులు, సిబ్బందిపై చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో నియంత్రికల వైఫల్యాలు ఎక్కువగా వుంటున్నాయని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కు దరఖాస్తు చేసిన వెంటనే సర్వీసులను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా పగటిపూట 9 గంటల విద్యుత్తును సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా జగనన్న కాలనీల విద్యుదీకరణ పనులను నేగవంతం చేయాలన్నారు. తిరుపతి పరిధిలో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. విద్యుత్ పంపిణీ నష్టాలు ఎక్కువగా వున్న ఫీడర్లను గుర్తించి, నష్టాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వినియోగదారులు విద్యుత్ అంతరాయాలు, సమస్యలపై టోల్ ఫ్రీ నంబరు:1912 లేదా 1800 425 155333 నంబరుకు కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్కమ్ డైరెక్టర్లు వి.ఎన్. బాబు, ఎన్.వి.ఎస్. సుబ్బరాజు, కె. శివ ప్రసాద రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్లు కె. గురవయ్య, కె.ఆర్.ఎస్. ధర్మజ్ఞాని, ఓఎస్టి శ్రీనివాసులు, తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణా రెడ్డి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసులుతోపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అకౌంట్స్ విభాగపు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.