contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్ లో …. రిఫరీపై దాడి చేసిన రెజ్లర్

కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనే జట్ల ఎంపిక కోసం భారత్ లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అయితే రెజ్లింగ్ పోటీల ట్రయల్స్ సందర్భంగా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది. సర్వీసెస్ జట్టుకు చెందిన రెజ్లర్ సతేందర్ సింగ్ బౌట్ రిఫరీపై దాడి చేశాడు. సతేందర్ మాలిక్ 125 కేజీల విభాగంలో నిర్వహించిన పోటీలో మోహిత్ చేతిలో ఓడిపోయాడు.

ఓ దశలో సతేందర్ సింగ్ 3-0తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ప్రత్యర్థి మోహిత్ తన బలాన్నంతా ఉపయోగించి సతేందర్ ను మ్యాట్ బయటికి నెట్టేశాడు. అయినప్పటికీ మోహిత్ కు రిఫరీ ఒక పాయింటే కేటాయించాడు. దాంతో మోహిత్ రివ్యూ కోరాడు. జ్యూరీ సభ్యుడిగా ఉన్న సత్యదేవ్ మాలిక్ దీనిపై స్పందిస్తూ… తాను, సతేందర్ మాలిక్ ఒకే గ్రామానికి చెందినవారమని, తాను తీసుకునే నిర్ణయం అతడికి అనుకూలంగా ఉంటే పక్షపాత ధోరణి అవలంబించానన్న చెడ్డపేరు రావొచ్చని, అందుకే జ్యూరీ నుంచి తప్పుకుంటున్నట్టు అప్పటికప్పుడు ప్రకటించారు.

దాంతో, మోహిత్ రివ్యూను పరిశీలించే బాధ్యతను సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్ కు అప్పగించారు. వీడియో ఫుటేజి పరిశీలించిన జగ్బీర్ సింగ్… మోహిత్ కు ఏకంగా మూడు పాయింట్లు కేటాయించాడు. ఓడిపోతాడనుకున్న మోహిత్ కాస్తా 3-3తో మళ్లీ రేసులోకి వచ్చాడు. బౌట్ ఆఖర్లో ఓ పాయింట్ చేజిక్కించుకుని సతేందర్ మాలిక్ ను ఓడించి కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించాడు.

ఈ బౌట్ ఫలితంతో సతేందర్ మాలిక్ రగిలిపోయాడు. తాను గెలవాల్సిన మ్యాచ్… సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్ కారణంగా ప్రత్యర్థి రెజ్లర్ మోహిత్ పరమైందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో జగ్బీర్ సింగ్ 57 కేజీల విభాగంలో ఓ బౌట్ కు రిఫరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నేరుగా మ్యాట్ పైకి వెళ్లిన సతేందర్ మాలిక్…. జగ్బీర్ తో గొడవకు దిగాడు. ఆపై గూబగుయ్యిమనేలా ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకు రిఫరీ జగ్బీర్ సింగ్ మ్యాట్ పై పడిపోయాడు.

ఈ ఘటనతో ఆ ఇండోర్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధికారులు రంగప్రవేశం చేసి సతేందర్ మాలిక్ ను అక్కడ్నించి తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ గొడవంతా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ చూస్తుండగానే జరిగింది. కాగా, రిఫరీపై దాడికి పాల్పడిన రెజ్లర్ సతేందర్ మాలిక్ పై జీవితకాల నిషేధం విధించినట్టు డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :