SC Bribery Cases: ప్రజాక్షేత్రంలో ఉన్నవారు అవినీతికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు అవినీతికి పాల్పడిన ప్రజా ప్రతినిధులకు విచారణ నుంచి ఎటువంటి మినహాయింపు లేదని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవినీతిక పాల్పడితే విచారణ తప్పదని ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది.
సభలో ప్రసంగం లేదా ఓటు కోసం ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు లంచం తీసుకునే కేసుల్లో చట్టసభ సభ్యులకు మినహాయింపును 1998 నాటి సుప్రీం తీర్పు సమర్థించింది. అవినీతి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షింపబడదని, 1998 నాటి తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 105, 194లకు విరుద్ధమని కోర్టు పేర్కొంది.
‘లంచం నేరం… ఓటు లేదా ప్రసంగం తర్వాత ఇవ్వబడిందా అనే దానిపై ఆధారపడి ఉండదు.. ప్రజాప్రతినిధి లంచం తీసుకుంటే నేరం జరిగినట్టే… లంచం పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ కల్పించదు… శాసన అధికారాల ఉద్దేశం.. లక్ష్యం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.. అధికారాలు సమిష్టిగా ఇంటికి ఉంటాయి.. ఆర్టికల్ 105/194 సభ్యులకు నిర్భయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. శాసనసభ్యుల అవినీతి, లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుంది..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘పీవీ నరసింహారావు కేసులో తీర్పు ప్రకారం లంచం తీసుకుంటే శాసనసభ్యుడికి రక్షణ ఉంటుంది.. అయితే లంచం తీసుకున్నప్పటికీ స్వతంత్రంగా ఓటు వేసిన శాసనసభ్యుడిని విచారించే విరుద్ధమైన పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యే లంచం తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారు’ అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.