ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రాష్ట్ర శాసనసభలో చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఉప ఎన్నికలు రావని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. గతంలో బీఆర్ఎస్ నాయకురాలు కె. కవితకు బెయిల్ మంజూరు చేసినప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేయకుండా వదిలేయడం తప్పయిపోయినట్టుంది అని ఆగ్రహం వెలిబుచ్చింది.
జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ ఎ.జి. మసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై సభలో చర్చించవద్దని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరినా, ముఖ్యమంత్రి తన ప్రకటనను కొనసాగించారని కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సుందరం కోర్టుకు వినిపించారు. “సభ్యులెవరూ ఉప ఎన్నికల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పీకర్ తరపున నేను చెబుతున్నాను. ఎటువంటి ఉప ఎన్నికలు రావు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కోరుకున్నా ఉప ఎన్నికలు జరగదు. వారు ఇక్కడకు వచ్చినా, అక్కడే ఉన్నా ఉప ఎన్నికలు ఉండవు” అని ముఖ్యమంత్రి అన్నట్లు సుందరం కోర్టుకు వివరించారు. స్పీకర్ తన తరపున ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా మౌనంగా ఉండిపోయారని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రకటనను జస్టిస్ గవాయి తప్పుబట్టారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్/కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ఉద్దేశించి, గతంలో కవితపై వ్యాఖ్యలు చేసినప్పుడే రేవంత్ రెడ్డిపై తాము చర్యలు తీసుకుని ఉండి ఉంటే, ఇప్పుడిలా వ్యాఖ్యానించి ఉండేవాడు కాదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
“గత అనుభవాల దృష్ట్యా అయినా ముఖ్యమంత్రి కొంత సంయమనం పాటించాల్సింది కదా? ఆ సమయంలో మిమ్మల్ని (రేవంత్ రెడ్డి) విడిచిపెట్టి, కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా మేము తప్పు చేశామా? రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందినవారు అనే దాని గురించి మేము పట్టించుకోం. కానీ ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వ్యక్తి… సంవత్సరం కూడా గడవకముందే మళ్లీ అలాంటి స్వరం వినిపించడం సరికాదు” అని న్యాయమూర్తి అన్నారు. సుప్రీంకోర్టు స్వీయ నియంత్రణ పాటిస్తుందని, ఇతర వ్యవస్థల్లోనూ అలాంటి స్వీయ నియంత్రణనే సుప్రీం కోర్టు ఆశిస్తుందని స్పష్టం చేశారు.
అంతకుముందు బుధవారం జరిగిన విచారణలో కూడా న్యాయవాది ఆర్యమా సుందరం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వివాదాస్పద ప్రకటనలు చేయకుండా ముఖ్యమంత్రిని హెచ్చరించాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి జస్టిస్ గవాయి సూచించారు.
గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయినందునే కవిత ఐదు నెలల్లో బెయిల్ తెచ్చుకున్నారని ఆయన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.