మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో బుధవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్‌లోని సీసీ కెమెరాలను పరీక్షించగా దొంగతనానికి వచ్చిన వ్యక్తిని చూసి షాక్‌కు గురయ్యారు. నిందితుడు ఏడో తరగతి విద్యార్థి. రహదారికి పక్కన నిత్యం జనసంచారంతో రద్దీగా ఉన్న సమయంలో బ్యాంకులోకి రాత్రి 8.20 గంటలకు బాలుడు ఒంటరిగా ప్రవేశించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా డైరెక్షన్ ఇస్తే యాక్షన్‌లోకి దిగాడా? లేదా స్వతహాగానే వచ్చాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. బయ్యారం మండలంలోని ఇర్సులాపురానికి చెందిన 13 ఏళ్ల బాలుడు ఎస్‌బీఐ బ్యాంకులో గడ్డపారతో ప్రవేశించాడు. బ్యాంకు వెనుకవైపు ఉన్న గ్రిల్స్ తలుపు తాళం పగులకొట్టి లోపలికి ప్రవేశించాడు. బ్యాంకులో ఉండే డెస్క్‌లలో డబ్బులు, నగలు ఉంటాయేమోనని గంటపాటు వెతికాడు. ఏమీ దొరకకపోవడంతో ఆ తర్వాత బయటకు వెళ్లిపోయాడు. గురువారం ఉదయం స్వీపర్ పద్మ బ్యాంకు వద్దకు వచ్చి చూడగా..తాళం పగులకొట్టి ఉండటం చూసి వెంటనే అధికారులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకులో రికార్డయిన సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి యత్నించిన బాలుడి ఆనవాళ్లను గుర్తించి ఇర్సులాపురంలో అదుపులోకి తీసుకున్నారు.
కేవలం 13 ఏళ్ల బాలుడు ఇతరుల ప్రమేయం లేకుండా చోరీకి యత్నించడం అసాధ్యమని అనుమానిస్తున్నారు. గడ్డపారతో ఎటువంటి చప్పుడురాకుండా సునాయాసంగా తాళం పగులకొట్టడం కష్టమని, ఎవరైనా డైరెక్షన్ ఇచ్చి చేయించి ఉంటారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ పాత నేరస్తుడి ప్రోద్బలంతో బాలుడు చోరీకి యత్నించినట్లు తెలుస్తోంది. వెనుక వైపు నుంచి బ్యాంకు గోడపైకి ఎక్కించి, తాను బయటే నక్కి.. ఆ తర్వాత బాలుడు బయటకు వచ్చేవరకూ పాతనేరస్తుడు అక్కడే వేచిఉన్నాడు. బాలుడు బయటికి వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం.