కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపింస్తున్నారు పేద, మధ్యతరగతి బిడ్డలు. అకుంఠిత దీక్షతో రాత్రి, పగలు చదివి తల్లిదండ్రుల కలల్ని, వారి కష్టాన్ని వమ్ము చేయకుండా.. వారి ఆశయాలను సాధిస్తున్నారు. తాము పెట్టుకున్న లక్ష్యాలకు ఏది అడ్డు కాదని నిరూపిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ మధ్యతరగతి కుటుంబ యువకుడు సివిల్ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. ఎస్సై ఉద్యోగం సాధించిన ఆ యువకుడిపై సర్వత్ర ప్రశంసలు కురిపిస్తున్నారు. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణానికి చెందిన వంగవరపు శ్యాంప్రసాద్, ప్రభావతి దంపతుల కుమారుడు వంగవరపు ప్రదీప్ సివిల్ ఎస్సైగా ఎంపికై పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు గర్వకారణమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి 2019 నోటిఫికేషన్ లో ఫైర్ కానిస్టేబుల్ గా ఎంపికయి కొద్దిరోజులు విధులు నిర్వర్తించి, ఉద్యోగానికి రాజీనామా చేసి, ఎస్సై అవ్వాలనే లక్ష్యంతో కాకినాడ శ్యామ్ ఇంస్టిట్యూట్ లో శిక్షణ పొంది ఇటివల ఎస్సై ఫలితాల్లో 224 మార్కులు సాధించి జోన్ – 3 లో సివిల్ ఎస్సై గా ఎంపికయ్యారు. ప్రదీప్ తండ్రి వంగవరపు శ్యాంప్రసాద్, ఫర్టిలైజర్ వ్యాపారి. తల్లి ప్రభావతి డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్టు లో సీసీ గా విధులు నిర్వహిస్తున్నారు.