సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడం జరిగింది, ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో సుమారు 50వేల మంది గ్రామ పంచాయితీ కార్మికులు ఉన్నారు. వీరు పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, స్వీపర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర కేటగిరిలలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 51 జీవోను తెచ్చి వివిధ కేటగిరీలను రద్దుచేసి మల్టీపర్పస్ పనివిధానం తీసుకొచ్చి కార్మికులకు పని భారం పెంచింది. ఏ పనైనా చేయాలని బలవంతంగా చేయించుకుంటూ కార్మికులను వేధింపులకు గురిచేస్తూ పనిలో నుండి తొలగిస్తున్నారు. కారోబార్లతో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, ట్రాక్టర్ డ్రైవర్స్, చివరికి ప్రజా ప్రతినిధుల ఇండ్లలో వ్యక్తిగత పనులను కూడా చేయిస్తున్నారు. నైపుణ్యం లేని పనులు చేయించడంతో ప్రమాదాలకు గురై చనిపోయిన కుటుంబాలను అదుకోవడం లేదు. గ్రామ పంచాయతీ సిబ్బందిలో అర్హులను పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి. పీఆర్‌సీ నిర్ణయం ప్రకారం రు.19వేల వేతనం చెల్లించాలి. 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రస్తుతం అవసరాలకనుగుణంగా కార్మికుల్ని తీసుకోవాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. ఆదాయమున్న మేజర్ పంచాయితీల్లో వేతనాల పెంపునకు అనుమతినివ్వాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దుచేసి వివిధ కేటగిరిలను యధావిధిగా కొనసాగించాలి. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి. ఆర్హతకల్గిన వారందరిని పంచాయతీ కార్యదర్శులుగా తీసుకోవాలి. రు.2లక్షల ఉన్న ఇన్సూరెన్స్‌ను రు.5లక్షలకు పెంచాలి. పీఎఫ్, ఇఎస్‌ఐతో పాటు, ప్రమాదాల్లో మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, అంత్యక్రియలకు రు.30వేల ఆర్థిక సహయం అందించాలి, సిబ్బందికి ఏడాదికి ఒకసారి బట్టలు, ఇతర సౌకర్యాలు అందివ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బోనగిరి లింగం, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.