సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా స్కీంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా రూ. 40లక్షలు ఉంది. ఇప్పుడు రూ. కోటికి పెంచింది కాంగ్రెస్ సర్కార్. అయితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ బీమాను 20లక్షల నుంచి 40లక్షల వరకు పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా 43వేల మంది కార్మికులకు ఈ కోటిరూపాయల బీమా పథకం వర్తించనుంది. అయితే ఇప్పటి వరకు కేవలం సైనికులకు మాత్రమే ప్రమాద బీమా కోటిరూపాయలు ఉండేది. ఇప్పుడు సింగరేణి కార్మికులు కూడా కోటి రూపాయల బీమా వర్తిస్తుంది.
ఈ మేరకు బ్యాంకర్లతో చర్చలు జరిగిన కాంగ్రెస్ సర్కార్ వాటితో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. సింగరేణి కార్మిక లోకానికి ఇది చారిత్రాత్మక రోజు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి పాత్ర మరువలేమన్నారు. గత పాలకులు స్రుష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని సీఎం అన్నారు. గత పదేళ్లలో సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదన్నారు. పదేళ్లలో నిధులను బీఆర్ఎస్ సర్కార్ దుర్వినియోగం చేసిందని ఫైర్ అయ్యారు. 2014లో మిగులు బడ్జెట్ గా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని పదేళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించిందని మండిపడ్డారు.
మరోవైపు గత సర్కార్ ఉద్యోగాల జీతాలు నెల చివరిలో చెల్లిస్తే..కాంగ్రెస్ వచ్చాక నాలుగో తారీఖునే చెల్లిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. 15రోజుల్లోనే రైతు బంధును చెల్లించామని సీఎం చెప్పారు. సింగరేణి సంస్థ ఉద్యోగుల ప్రమాద బీమా స్కీంపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రేవంత్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్న సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన లేదా, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది అందరికీ ఈ ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది.