మంత్రి పదవిని ఆశించిన శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) ఎమ్మెల్యే నరేంద్ర భోండేకర్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ డిప్యూటీ నేతగా, విదర్భ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. భండారా-పావని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన పార్టీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు మంత్రి పదవిని ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అయితే, నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఏక్‌నాథ్ షిండే, ఉదయ్ సామంత్, ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు మెసేజ్ పంపారు.
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉదయ్ సామంత్‌కు మంత్రి పదవి దక్కింది. మొత్తం 39 మంది నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 19 మంది బీజేపీ నేతలు కాగా, 11 మంది శివసేన, 9 మంది ఎన్సీపీ నేతలు ఉన్నారు. ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలతో కలుపుకొంటే కేబినెట్ బెర్త్‌ల సంఖ్య 42కు చేరింది.