ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ?
గత శుక్రవారం రాత్రి గ్రామంలోని రఘుపతి మధుసూదన్ రావు అనే వ్యక్తి ఇంట్లోకి పాము వచ్చింది. దీంతో ఇంట్లో అందరు కేకలు పెట్టారు. ఈ క్రమంలోనే మధుసూదన్ రావు ఆ పామును చంపేందుకు ప్రయత్నించాడు. కర్రతో ఓ దెబ్బ కొట్టాడు. అనంతరం ఆ పాము తప్పించుకుని అక్కడే ఉన్న బావిలో పడిపోయింది. నీళ్లలో పడేసరికి ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. శనివారం ఉదయం బావి నుంచి నీటిని తోడేయాలని నిర్ణయించారు.
శనివారం ఉదయం బావిలో నీళ్లు తోడేందుకు సిద్ధమయ్యారు. ఇంజిన్ సహాయంతో నీళ్లన్నీ బయటకు తీసేస్తున్న క్రమంలో మరో ఘటన చోటుచేసుకుంది. నీటిని తోడుతున్న ఇంజిన్ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు బావిలోకి దిగిన మధుసూదన్ రావు ఎంతకీ పైకి రాకపోవడంతో ఆయనను కాపాడేందుకు మధుసూదన్ రావు మేనల్లుడు కింతలి ఢిల్లేశ్వర రావు బావిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఇద్దరూ బావిలోనే ప్రాణాలొదిలారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను బావి నుంచి వెలికి తీసి, పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పండుగ రోజు ఇద్దరు మరణించారంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు.