చీమకుర్తి: మీరు చూస్తున్న దృశ్యం చెరువులదో, లేక నీటి కుంటలదో అనుకుంటే పొరపాటు పడతారు..నిత్యం వాహనాల తో రద్దీగా ఉండే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఒంగోలు- కర్నూలు రహదారిలో ఉన్న బూద వాడ కంకర మిల్లుల సమీపంలోని రోడ్డు సుమారు 500 మీటర్ల వరకు నీటి గుంటలతో ఉన్నది. రామ తీర్థం నుండి మర్రి చెట్ల పాలెం వెళ్లే మార్గం మధ్యలో ఉన్న రోడ్ల దుస్థితి ఇది . నిత్యం గ్రానైట్ వాహనాలు పరిమితికి మించి బరువును వేసుకొని గ్రానైట్ రాళ్లను రవాణా చేయడం వలన తొలిత చిన్న గుంతలుగా ఏర్పడి , ఇప్పుడు చెరువులను తలపించే విధంగా మారాయి.కొద్దిపాటి వర్షం కురిస్తేనే ఈ విధంగా ఉన్న రోడ్లు, వరుసగా రెండు మూడు రోజులు తుఫాను ప్రభావంతో పెద్ద చెరువు లాగా మారాయి. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఆర్టీసీ బస్సులు సైతం దారి మళ్లించుకుని ప్రత్యామ్నాయ దారిలో వెళ్లవలసిన పరిస్థితి ఉంది.
ఈ రోడ్లను వినియోగించి రవాణా చేస్తున్న గ్రానైట్ క్వారీ యజమానులు, కంకర మిల్లుల యజమానులు, గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లు కోట్లు గడిస్తున్న, వాటి వల్ల దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణిస్తున్న సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రానైట్ సంస్థల నుండి వచ్చే తాయిలాల కోసం ఆశపడి అధికారులు కూడా ఈ విచ్చలవిడి రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. రోడ్లను బాగు చేయలేకపోతున్నారు.
మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్ పర్యటన లో 1.75 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మత్తులకు ఆర్ అండ్ బి అధికారులకు ప్రతిపాదనలు పంపిన ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం.
ఇకనైనా అధికారులు స్పందించి రోడ్లను మరమ్మత్తు చేయడం ద్వారా సామాన్య ప్రజల ప్రయాణంలో ఇబ్బందులను తొలగిస్తారో లేదో .. వేచి చూడాలి.