కొత్త తరం జడ్జీలకు సోషల్ మీడియా పెను సవాలుగా మారుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓకా అభిప్రాయపడ్డారు. తీర్పులపై అభిప్రాయ వ్యక్తీకరణ నుంచి దురుద్దేశాలను ఆపాదించేదాకా వచ్చిందని చెప్పారు. కోర్టులకు సోషల్ మీడియా తలనొప్పిగా మారిందన్నారు. భవిష్యత్‌లో కోర్టులు, జడ్జిలు సోషల్ మీడియా నుంచి పలు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ప్రజలకు కోర్టులపై ఉన్న విశ్వసనీయత, నమ్మకమే న్యాయవ్యవస్థకు పునాది అని ఆయన పేర్కొన్నారు. ప్రజల నమ్మకం బలంగా ఉన్నంత వరకు ఎలాంటి దురుద్దేశాలను ఆపాదించినా వాటి ప్రభావం తమపై ఉండబోదని అన్నారు.
నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న సదస్సుకు జస్టిస్ అభయ్ ఓకా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. రెండు రోజుల ఈ సదస్సులో ‘సమకాలీన న్యాయ పరిణామాలు, చట్టం, సాంకేతికతతో న్యాయవ్యవస్థ పటిష్టం’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘1960–80 మధ్యకాలంలో కోర్టులు, తీర్పులపై స్క్రూటినీ చాలా తక్కువ. తర్వాత స్క్రూటినీతోపాటు ఒపీనియన్స్ కూడా వ్యక్తమయ్యేవి. సోషల్ మీడియా వచ్చాక కోర్టులు, తీర్పులు, జడ్జిలకు దురుద్దేశాలను ఆపాదించే పరిస్థితి వచ్చింది. అయితే, కోర్టులపై ప్రజలకు బలమైన నమ్మకం ఉంది. ఇదే కోర్టుల ఆస్తి” అని ఆయన చెప్పారు.
సమానత్వం ముఖ్యం: జస్టిస్ ఉజ్జల్ భూయాన్
స్త్రీ, పురుష సమానత్వం ఎంతో ముఖ్యమని సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. ‘కోర్టుల నిర్వహణ, కేసుల విచారణతోపాటు రాజ్యాంగ లక్ష్యాల అమలుకు చర్యలు తీసుకోవాలి. మహిళల వస్త్రధారణ, భార్యాభర్తల ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కోర్టులది కాదు’ అని అన్నారు. ఈ సదస్సులో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ సుజయ్ పాల్, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాలకు చెందిన జడ్జిలు పాల్గొన్నారు.