ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూ కుంభకోణాలకు అడ్డాగా మార్చేశారని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వ కార్యదర్శి కూడా ఇంతలా దిగజారలేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.
జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ అని విమర్శించారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. శానససభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారని, కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించారని మండిపడ్డారు. జగన్‌కు సీఎస్ గులాంగా మారి చట్టాలను బూటు కాళ్ల కింద నలిపేశారని, జగన్ దోచుకున్న లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్ గా మారిపోయారని జవహర్ రెడ్డిపై సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజల పాలిట పెనుశాపమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఒక సీఎస్‌గా ఎలా అంగీకరించారంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ రైతూ అడగకున్నా రీసర్వేను వారిపై ఎలా రుద్దుతారు, వారసత్వంగా వచ్చిన పొలాల్లో వైఎస్‌ఆర్ జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు ఎలా నాటుతారని నిలదీశారు. పోలింగ్ సందర్భంగా రాజకీయ హింస చోటుచేసుకుంటే అదుపు చేయడంపైన దృష్టి పెట్టకుండా కన్ఫర్డ్ ఐఏఎస్ ల ఫైల్ గురించి ఆలోచించడమేంటని సోమిరెడ్డి మండిపడ్డారు.