- రోడ్డు సేఫ్టీ మరియు ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్స్, యజమానులకు అవగాహన కల్పించిన ఎస్పీ దామోదర్.
- నిబంధనలు పాటించకుంటే ఆటోలను సీజ్ చేస్తామని హెచ్చెరిక
- ఆటో డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసినా, మహిళలు,పిల్లలు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవు.
- రహదారి భద్రత మనందరి భాద్యత… రోడ్డు ప్రమాదాలు, నేరాల నియంత్రణలో ఆటో డ్రైవర్లు పోలీసులకు సహకరించాలి.
ప్రకాశం జిల్లా, ఒంగోలు : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రోడ్డు భద్రతా మరియు ట్రాఫిక్ నియమాలపై ఒంగోలు నగరంలోని ఆటో డ్రైవర్స్ మరియు యజమానులకు బుధవారం పోలీస్ కల్యాణ మండపంలో జిల్లా ఎస్పీ అవగాహన కల్పించి వారికి పలు సూచనలు చేశారు. ఆటో డ్రైవర్ల ట్రాఫిక్ పరమైన సమస్యలు, అదేవిధంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్లు వారి యొక్క సంక్షేమం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు కొత్త వాహన చట్టాలపై కూడా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క మనిషిలో ఆత్మ గౌరవం ఉండాలని, ఆటో డ్రైవర్ల వృత్తిని జాగ్రత్తగా, గౌరవంగా నిర్వహించాలని, ఆటో డ్రైవర్లు నిబంధనలు మేరకు నడుచుకుంటే రహదారి ప్రమాదాలు తగ్గడమే కాకుండా చాలా వరకు ట్రాఫిక్ అవాంతరాలు ఉండవన్నారు.
ఆటో డ్రైవర్లు రోడ్డు సేఫ్టీ మరియు ట్రాఫిక్ రూల్స్ అవగాహనతో ఉండి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను & రోడ్డు ట్రాఫిక్ సంజ్ఞలను పాటించాలన్నారు. డ్రైవ్ చేసే ఆటోలకు రిజిస్ట్రేషను పత్రం, డ్రైవింగు లైసెన్సు, ఇన్సూరెన్సు, కాలుష్యం నియంత్రణకు పొల్యూషను ధృవ పత్రం తప్పనిసరిగా కల్గి ఉండాలన్నారు.
ఆటో డ్రైవర్లు తప్పకుండా యూనిఫాం ధరించాలని, ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని, నిర్లక్ష్యంగా, సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి, అతి వేగంగా మరియు ఓవర్ లోడుతో ఆటోలు నడపరాదన్నారు.
ముఖ్య కూడళ్ళలో ఆటోలను అస్తవ్యస్తంగా నిలిపి ఇతర వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆటోలను పార్కింగ్ ఏరియాల్లో సక్రమంగా క్రమ పద్ధతిలో నిలుపుకోవాలన్నారు.
ఆటోలకు నెంబర్ ప్లేట్లు యం.వి యాక్ట్ నిబంధనల ప్రకారం ఉండాలని, ప్రతి ఒక ఆటో విధిగా పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మరియు రేడియం స్టిక్కర్స్ కలిగి ఉండాలని, ఎవరైనా వస్తువులు ఆటోలో మర్చిపోతే వెంటనే స్థానిక పోలీసులకు అప్పగించాలన్నారు.
ప్రాణం ఎంతో విలువైనదని, మన మీద కుటుంబం ఆధారపడి ఉంటుందని దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఆటో డ్రైవరు రహదారి భద్రత నియమాలు పాటించాలి. రహదారి భద్రత మనందరి భాద్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.
డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, ఆటోల్లో ప్రయాణించే మహిళలు, పిల్లలు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా లేదా ఇతర చట్టవ్యతిరేక,అసాంఘిక పనులకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మీ అందరి యొక్క సహకారంతో ట్రాఫిక్ సమస్యలు మరియు నేరాలు జరగకుండా చూడవచ్చని, ఏవైనా చట్టవ్యతిరేక,అసాంఘిక కార్యకలాపాలు, అనుమానిత వ్యక్తులపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 112/100 లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266 ద్వారా సమాచారం అందించాలని సూచించారు.
రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ఆటో డ్రైవర్లతో జిల్లా ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, తాలూకా సిఐ అజయ్ కుమార్, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, సీతారామరెడ్డి, ట్రాఫిక్ ఆర్ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.