తిరుపతి : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తిరుపతి విజయ్ కుమార్ (క్రికెట్ విజయ్) కి కీలక బాధ్యతలను అప్పగించింది. 71 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత కల్పించింది. అందులో భాగంగా క్రికెట్ పై ఆసక్తి కలిగి బీసీసీఐ, ఎన్సీఏ, లెవెల్ వన్ కోచ్ గా క్రికెట్ కి సేవలు అందించిన విజయ్ కుమార్(క్రికెట్ విజయ్) కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో చోటు కల్పిస్తూ ఏసిఏ స్టేట్ ఇన్ ఫ్రా కమిటీ చైర్మన్, సౌత్ జోన్ అకాడమీస్ కమిటీ కన్వీనర్ పదవులకు ఎంపిక చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి క్రికెట్ విజయ్ ని అసోసియేషన్ నాయకులు దుశ్యాలువతో ఘనంగా సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా క్రికెట్ అసోసియేషన్ పై గత 17 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన క్రికెట్ విజయ్ కి ఈ పదవులు దక్కడం నిజంగా ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో క్రికెట్ కు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క క్రికెటర్ కు మంచి భవిష్యత్తు అందించాలన్నదే ధ్యేయమని, అందులో భాగంగా జిల్లా క్రికెట్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఏసీఏ స్టేట్ ఇన్ ఫ్రా కమిటీ చైర్మన్, ఏసీఏ సౌత్ జోన్ అకాడమీ కమిటీ కన్వీనర్, చిత్తూర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్(క్రికెట్ విజయ్) పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రికెట్ పై ఆసక్తి కలిగి ప్రతిభ ఉన్న ఏ ఒక్క క్రికెట్ క్రీడాకారుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కోర్టుల చుట్టూ 17 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి గత రెండు నెలల క్రితం విజయం సాధించామన్నారు. ఇన్నేళ్లు రాజకీయ అండలు ఉన్నవారు మాత్రమే క్రికెట్ లో అవకాశాలు పొందారని, నిజమైన క్రీడాకారులు వెనక పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఇవ్వనున్నామన్నారు.క్రికెట్ ఆడిన వారు అసోసియేషన్ లో ఉంటే క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతుంది అనడానికి గడిచిన రెండు నెలల నిదర్శనమన్నారు. గత రెండు నెలలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ జోన్ కు 7 మంది, అండర్ 23 జోనుకు 7 మంది, అండర్ 19 ఉమెన్ టి20 స్టేట్ టీం కు ఇద్దరు ఎంపిక కావడం నిజంగా గొప్ప విషయం అన్నారు. ఇన్ని రోజులు రాజకీయ కనుసైగల్లో ఒకరిద్దరికే పరిమితమైన క్రీడాకారుల భవిష్యత్తు ఇప్పుడు ఏకంగా జోన్ కి 14 మంది, స్టేట్ కి ఇద్దరు ఎంపికవడం చూస్తే క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉందో ఊహించవచ్చన్నారు. అదేవిధంగా జిల్లాలో మంచి గ్రౌండ్ లను తీసుకురావాలన్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాక రానున్న రోజుల్లో క్రికెట్ పై ఆసక్తి కలిగిన క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నామని తెలిపారు. అందులో భాగంగానే అంపైరింగ్ 100, కోచ్ లు 50, స్కోరర్స్ 50, మేనేజర్లు 50 పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. అందుకు 18 సంవత్సరాలు నిండి 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన వారు ఈనెల 29వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాలకు గిరి ప్రకాష్ 9849058490, శ్రీనివాసమూర్తి 9573378778, సతీష్ యాదవ్ 8886185559, నవీన్ 8555054943 లను చరవాణి ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. అంతేగాక గ్రామస్థాయి నుంచి క్రికెట్ క్రీడాకారులకు భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఫ్రాన్సిస్ ద్వారా 40 టీమ్లకు ఆపర్చునిటీస్ ని కల్పించి క్రికెట్ ను మరింత దగ్గర చేయనున్నామని తెలిపారు. అంతేకాక ఈ మ్యాచ్ లన్నింటికి ప్రత్యక్ష ప్రసార సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా క్రీడాకారుల ప్రతిభ మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. కావున క్రికెట్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రికెట్ విజయ్ కోరారు.ఈ సందర్భంగా తనకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అవకాశం కల్పించిన ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు, ఉపాధ్యక్షులు ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి విష్ణుకుమార్ రాజు, కోశాధికారి దండపాని శ్రీనివాస్, కౌన్సిలర్ విష్ణుతేజాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాలి వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి సతీష్ యాదవ్, ఈసీ మెంబర్లు ప్రకాష్ నాయుడు, శివప్రసాద్, టీవీ రమణ, హరికృష్ణ పాల్గొన్నారు.