నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటలో SLBC టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. పైకప్పు పడి ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఉదయం షిఫ్ట్‌లో సొరంగంలో పనులకు 40 మంది కార్మికులు వెళ్లారు. సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్‌లు కింద పడటంతో ప్రమాదం జరిగింది. ఒక్కొక్కరిగా సొరంగం నుంచి కార్మికులు బయటకు వస్తున్నారు. సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల సాయంతో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి. ఘటనాస్థలంలో నీటిపారుదలశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ, హైడ్రా, అగ్నిమాపక, నీటిపారుదలశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశంతో ఘటనాస్థలానికి పలువురు మంత్రులు హెలికాప్టర్‌లో వెళ్లారు. మంత్రుల వెంట నీటిపారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, అధికారులు ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.