ఆకాశంలో నేడు చంద్రుడు నిండు రూపంలో దర్శనమివ్వనున్నాడు. నేడు ఆషాడ పౌర్ణమి. ప్రపంచవ్యాప్తంగా నేటి పున్నమి చంద్రుడికి పలు విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పున్నమి పూర్ణ చంద్రుడిని ఫుల్ మూన్ అని, స్ట్రాబెర్రీ సూపర్ మూన్ అని, మెడ్, హనీ మూన్, రోజ్ మూన్ ఇలా పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. మన దగ్గర వ్రతపౌర్ణమి అని కూడా అంటారు.
మంగళవారం, బుధవారాల్లో సాయంత్రం నుంచి పూర్ణచంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. భూమికి అత్యంత సమీపంగా చంద్రుడు చేరువ అయినప్పుడు వచ్చే పౌర్ణమిని ఫుల్ మూని అని చెబుతుంటారు. ఆ సమయంలో భూమి నుంచి 3,63,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంటాడు. ఇంత దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు మరింత ప్రకాశవంతంగా, పెద్ద సైజులో కనిపిస్తాడు. సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే పరిమాణంతో పోలిస్తే ఫుల్ మూన్ రోజు కనిపించే చంద్రుడి ఆకారం మరింత పెద్దగా ఉంటుంది. భూమికి 4,05,000 కిలోమీటర్ల దూరానికి చంద్రుడు వెళ్లినప్పుడు దాన్ని దూరంగా పరిగణిస్తుంటారు.
అమెరికా ఈశాన్య ప్రాంతంలో నివసించే గిరిజన తెగలు ఈ కాలంలో స్ట్రాబెర్రీలను పండిస్తుంటారు. అందుకే దీనికి స్ట్రాబెర్రీ సూపర్ మూన్ అనే పేరు వచ్చింది. యూరోప్ ప్రాంతంలో దీన్నే హానీమూన్ అంటుంటారు. జూన్ చివరి నుంచి తేనె సాగు కాలం కావడంతో అక్కడ దీనికి ఈ పేరు వచ్చింది. యూరోప్ లోనే దీనికి రోజ్ మూన్ అని కూడా పేరు. ఈ కాలంలో గులాబీలు అక్కడ పుష్పిస్తుంటాయని అలా పిలుస్తుంటారు. ఇంకా ఫ్లవర్ మూన్, హాట్ మూన్, ప్లాంటింగ్ మూన్ అనే పేర్లు కూడా ఉన్నాయి.
హిందువులకు వ్రత పూర్ణిమ ఇది. బౌద్ధులు పోసన్ పోయ అని పిలుస్తారు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఆకాశంలో తూర్పు వైపున చూస్తే చంద్రుడి దర్శనం అవుతుంది.